Saturday, 4 July, 2009

సంఘర్షణ

చుట్టూ గడియలేసి పహారా కాస్తున్న నా హృదయపు అంతఃపురం లోనికి వెన్నెల్లా నువ్వెప్పుడు వచ్చేసావో!.. పందిరిలా అల్లుకునేసరికి గోడలెపుడు వాటి గంభీర అస్తిత్వాన్ని కోల్పోయాయో!..

నీ ఉనికి తీరాన స్వాంతన పొందుతున్న నా పాదముద్రలు ఎప్పటికప్పుడు చెరిగిపోతున్నా దారిలో ఏరుకున్న గవ్వలు జ్ఞాపకాల పేజీల్ని ఇంకా అలంకరిస్తున్నాయి.

సముద్రంలా నువ్వు లోపల ఉన్నావన్న నిజాన్ని ఆ కాపలావాడు అస్సలు భరించలేడు. లోపలికి ఎవరూ చొరబడలేదన్న భ్రమనే ఇంకా శ్వాసిస్తున్నాడు. నిజానికి కొన్ని భ్రమలే మనల్ని బ్రతికిస్తుంటాయి. లేదంటే నాలోని వాడు ఏమైపోయేవాడో..

నీ అవాజ్యమైన ప్రేమంటే నాకు గొప్ప భయం. ఓపలేను. అందుకే నా వైకల్యం కనపడనీకుండా నీనుంచి తప్పించుకు తిరుగుతుంటాను. కానీ నేను పారిపోతున్నది నానుంచేనని ఎప్పటికప్పుడు మర్చిపోతాను.

'నన్ను పరిహసించదానికే వచ్చావా?.. పో!.. ' అని నిష్టూరమాడుతాను. కానీ నువ్వు నా కసురుని పట్టించుకోనట్లే కనబడతావు. అందుకు నాకు మరీ కోపం.

నిన్ను స్వీకరిద్దామనుకుంటే నా అంత స్వార్ధపరుడు ఉండడు. వదులుకుందామంటే నా అంత మూర్ఖుడూ లేడు.

Wednesday, 4 March, 2009

ఆత్మ టపా

బ్లాగులో కొత్త టపా (కధ) రాసి చాలా రోజులయ్యింది. ఈ మధ్యన ఐడియాలే రావట్లేదు. 'ఏమిటి.. నా బుర్ర వట్టి పోయిందా..ఇప్పటి వరకూ రాసినవి తప్పితే మరే స్టోరీ ఐడియాలు లేవా?.. రావా?..' ఇలా ఆత్మన్యూనతా భావాలు నన్ను పీడిస్తుంటే పేపరు, పెన్ను పట్టుకుంటే ఏదో ఐడియా తట్టకపోదా అని బలవంతంగా కూర్చున్నాను. రాయక ముందర ఆత్మన్యూనత; రాసాక నచ్చుతుందా, నచ్చదా.. కామెంట్లు వస్తాయా, రావా.. అన్న టెన్సన్లు; నచ్చకపోతే ఫ్రస్ట్రేషన్, నచ్చితే మరింత మంది మెచ్చాలన్నఉబలాటం.. ఇలా టపా రాసే క్రమంలో ఏ దశ కూడా బాగోదు ఒక్క - 'మెరుపులాంటి ఆలోచన మెదలడం, రాయడం' అన్న ఫేజ్ తప్పితే. ఇంకొంచం లోతుగా ఆలోచిస్తే ఆ 'మెరుపు మెరవడం, అదిచ్చే ప్రేరణ' లో కూడా నా గొప్పతనం ఏమీ లేదు. మరెందుకో ఈ పితలాటకం. కొంచం ఎక్కువ ఆలోచిస్తున్నానిపించింది. మళ్ళీ ఏదో కధ రాయాలన్న విషయం మీద దృష్టి పెట్టాను. బుర్రలో ఏ మెరుపూ మెరవట్లేదు. 'అలా కాకుండా ఎందుకు రాయలేను? ఒక స్టాండర్డ్ స్ట్రక్చర్ ని ఫాలో అయితే సరి.' అనుకొని ముందుగా ఒక కారెక్టర్ ని సృష్టించాను. మగవాడే. వాడికి 'శీను' అని పేరు పెట్టాను. వాడి కారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం ఆలోచిస్తూ ఉంటే అన్నీ నా లక్షణాలే అగుపిస్తున్నాయి (మెరుపు మెరవకపోతే అలానే ఉంటుంది మరి.). మెల్లగా వాడు నేనయ్యాను.

దూరంగా ఎక్కడో మెరుపు మెరిసింది. నేను ఎప్పటిలాగే కొండని ఎక్కుతూ ఉన్నాను. నాలాగే చాలామంది కొండ శిఖరాన్ని అందుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఆ శిఖరం పేరు విజయం. కొన్నిసార్లు దానిని అందుకుంటాను. కానీ కాసేపు కాగానే నేనున్న ప్లేస్ చదునుగా మారి విజయశిఖరం మరింత ఎత్తులో కనపడుతుంది. చుట్టుపక్కలవారు అప్పటికే ఎక్కేస్తూ ఉంటారు. దాంతో గాభరాగా నేనూ పోటీ పడతాను. అప్పుడప్పుడు పడిపోతూ ఉంటాను. దాంతో ఫ్రస్ట్రేట్ అయ్యి మరింత తీవ్రంగా ప్రయత్నిస్తుంటాను. కొండని ఎక్కే ప్రయత్నం ప్రారంభించిన మొదట్లో ఉన్నంత స్పష్టత ఇప్పుడు లేదు. నా దృష్టి రానురాను మందగిస్తూ ఉందేమో. ఇలా ఆత్మావలోకనం చేసుకొనే ఆలోచనలు రాకుండా ట్రాఫిక్ శబ్దాలు నన్ను మళ్ళీ రొటీన్ లో పడేస్తాయి. ఇలా జీవితాంతం కష్టపడుతూ, కష్టపడుతూ ఇప్పుడు మృత్యువు అంచుకు చేరుకున్నాను. ఇంకొన్ని ఘడియలే మిగిలాయి. తర్వాత చేసేదేమీ లేదని బోధపడ్డాక ఇప్పుడు చేస్తున్నది నిరర్ధకమనిపించింది. వదిలేసాను. చాలా రిలీవ్డ్ గా ఫీలయ్యా. ఆఖరి క్షణాల్లో విచిత్రంగా దృష్టి మెరుగయ్యింది. విజయం కన్నా వైభవంగా మరొక శిఖరం కనపడింది - ఆనందం. అసలు నేను మొదట బయలుదేరింది దానికోసమే. పోటీలో పడి ఆ విషయమే మర్చిపోయాను. నేనెక్కడ ఉన్నానో తెలుసుకుందామని తలెత్తాను. నాకన్నా చాలామంది ఎత్తులో ఉన్నారు. కిందకి చూస్తే తెలిసింది నేను కూడా చాలామంది కన్నా ఎత్తులో ఉన్నానని. అసలిదంతా సబ్జెక్టివ్ గా అనిపించింది. నేను వచ్చిన మార్గంలో పక్కగా కొన్ని 'సంతృప్తి' మజిలీలున్నాయి. వస్తున్నప్పుడు వాటిని నేనంతగా పట్టించుకోలేదు. నా సహచరులు కొందరు అక్కడే సేదతీరుతున్నారు. విచిత్రంగా వారికి ఆనందశిఖరం అందుతూ ఉంది. నా అంతిమ క్షణాలు సమీపించాయి. చుట్టూ ప్రకాశం అలుముకుంటోంది. ఇంకొక రెండు క్షణాలు ఉందనగా ఆ వెలుగులో నాకు సమాంతరంగా మరొక మార్గం కనపడింది. అక్కడ ఎత్తులు-పల్లాలు లేవు. ఆత్మానందం అనే ఉచ్ఛ స్థితి అది. అక్కడ నడుస్తున్నవారు ఒక గొప్ప విలువకో లేదా పదిమందికి ఉపయోగపడే ఒక ఉన్నతమైన ఆశయానికో లేదా ఒక కళ కోసమో తమని తాము ఆనందంగా కోల్పోయి అంకితమవుతున్నారు. వీరు పాటుపడుతున్న విలువలు మాత్రం జనరేషన్స్ తో సంబంధం లేకుండా భూత భవిష్యత్తులకి వెరవకుండా స్థిరంగా ప్రకాశిస్తున్నాయి. మెల్లగా ప్రపంచమంతా ఒక తెల్లని కాంతిలా మారింది. శీను దేహాన్ని ప్రాణం వీడింది.

నా పెన్ను ఆగింది. రాసిన కధని మళ్ళీ చదువుకున్నాను. 'ఇదొక స్టోరీనా?.. దీనికెవరూ కామెంటు చెయ్యరు.' అనుకొని విసుగ్గా పక్కన పడేసాను. మూడ్ పాడయింది. రాత్రవ్వడంతో ఈరోజుకిక పని కాదనుకొని పక్క మీద వాలాను.

జీవితాంతం విజయం, గుర్తింపు కోసం పాటుపడి సంతృప్తి చెందక చనిపోయిన శీను ఆత్మగా మారాడు. ఈ టపా ద్వారానైనా పదిమందికీ తెలుస్తాను కదా అనుకొని రచయిత పడుకున్నాక రహస్యంగా బ్లాగర్ లోకి లాగిన్ అయి టపాని పబ్లిష్ చేసాడు.

Labels:

Wednesday, 11 February, 2009

మార్నింగ్ రాగ...

జనవరి మాసపు ఉదయాన డిజికామ్ పట్టుకొని వీధుల మీద పడ్డాను



కాసేపు
నడవగానే 'మరుమల్లెల్లో ఈ జగమంతా విరియగా..' పాట మనసులో మెదిలి పెదవులపైకి వచ్చింది.



కుక్కపిల్లలు
ఒకదానిమీదొకటి సుఖంగా పడుకున్నాయి.



ఓ రోజా పువ్వు వికసించింది.



'చలికాలం పొద్దున్న ఎండకాసుకుంటే భలే ఉంటుంది కదూ!.'


ఒకాయన టీ తాగుతూ సమ్మగా పేపర్ చదువుకుంటున్నాడు.



పిల్లలు కూడా ఎంచక్కా ముగ్గులేస్తున్నారు.



వీధులు శుభ్రం చేసేవాళ్ళు ఏ గుర్తింపుకీ నోచుకోకపోయినా స్థితప్రజ్ఞుల్లా తమ పని తాము చేసుకుపోతున్నారు.



బసవన్న 'టింగురంగా!..' అంటూ వీధుల్లో తిరుగుతున్నాడు.



పూలమ్మి అప్పుడే షాపుని తెరిచింది.



'ఇడ్లీ. ఇడ్లీ..'



అన్నా, చెల్లెల్ల ఇసుకలాట.


నేను తోడు రాకపోతే తాత పేపర్ కొనుక్కోలేడు. పాపం!. పోనీలే.. ఆని వస్తా.



"School time .. bachchon ka school time."



చదువుల బరువు అమ్మకూ తప్పదు.



అమ్మ బ్యాగ్ మోస్తుంటే హీరో ఎంత దర్జాగా నడుస్తున్నాడో..



అన్నతో ఎంచక్కా సైకిల్ మీద..



ఇప్పుడు స్కూలుకి వెళ్లాలా.. అంత అవసరమా!..



నేనిక్కడ దాక్కుంటున్నా..



అసైన్‌మెంట్ చెయ్యలేదు.. ఇంట్లో ఏం చెప్పి స్కూల్ ఎగ్గొడదాం?..



నాకెవరూ తోడు లేరు. నేను స్కూలుకి రాను.



నాది కూడా సేమ్ ఫీలింగ్.




స్కూల్లో సార్లతో పరేషానే గానీ..దోస్తుగాల్లతో మస్త్ ఎంజాయ్ మల్ల.

Friday, 23 January, 2009

విరహ భోగం...

డాబా మీదకి వచ్చాను. వెన్నెల పాలిపోయి ఉంది. చంద్రుని వైపు చూడబుద్ధి కాలేదు. చూస్తే మళ్ళీ వెక్కిరిస్తూ నవ్వుతాడు. పక్కగా ఓ గాలి తెమ్మెర వెళ్ళింది. నువ్వు వెనుకగా వచ్చి నడుముకి చేయి జార్చి, చెవుల మీది కురులను సవరించి చెంపకి చెంప ఆనించిన అనుభవాన్ని తట్టి లేపింది. దానిని గమనించనట్టే ముఖాన్ని పక్కకి తిప్పుకున్నాను. ఆ మాత్రం గాలివిసురుకే చున్నీ ఎగిరి పక్కనున్న గులాబీ మొక్కకి చిక్కుకుంది. హే!.. దీనికో పువ్వు పూసింది. ఆప్యాయంగా ముఖాన్ని గులాబీకి దగ్గర చేశాను. ఉచ్ఛ్వాస గులాబీ పరిమళాన్ని పూసుకోగానే గుండె గదుల్లో నీ మందహాస సమ్మోహనం పొగమంచులా ప్రవేశించింది. తన్మయత్వానికి చేతి వేళ్లలో తన్యత పెరిగిందేమో గులాబీ ముల్లు వేలిలో దిగింది. ఈ బాధ వలనైనా శరీరానికి కొంచం స్పృహ వస్తుందని అలాగే పట్టిఉంచాను. కానీ నీ మత్తు మహత్తు చేసిన తిమ్మిరికి ఈ నొప్పి ఎలా తెలుస్తుంది.

స్నానం చేసి మనసు కొంచం తేలికపడ్డాక పడుకుందామని బాత్రూంలోకి వెళ్లాను. షవర్ నీరు కురుల మీదుగా శతాధిక పాయలుగా చీలి తనువంతా పారుతుంటే దేహం కోటి తంత్రుల ఘోషగా మారింది. షవర్ నీటికి ముఖాన్ని ఎదురుగా పెట్టి, చేతులతో జుట్టుని వెనక్కి తోసుకుంటూ ఓసారి తమకంతో నా చేతికండని పంటితో గిచ్చాను. బట్టలు వేసుకుంటున్నప్పుడు చూస్తే, ఆ భాగం ఎర్రగా కంది ఉంది. పదహారణాల సిగ్గుకి పూసంత మురిపెం కలిసి నా ముఖంలో మెరిసింది.

బాహ్యంగా పవళించినా పలవరింతలు మాత్రం ఆగలేదు. కుడి చేయి తివాచీ పరచి ఆహ్వానిస్తున్నట్లుగా పరచుకొని ఉంది (నీకోసమేమీ కాదబ్బాయ్!.). ఏ అధఃపాతాళానికో జారిపోతున్నట్లు గుండెలు నీ ఆసరా కోసం కొట్టుకుంటున్నాయి. నడుము దొంతరల మధ్య నీ చేయి కాకుండా గాలి దూరినందుకు నడుము ఉక్రోషంతో విలవిలపోతోంది. కొంటె ఊహల పీయూషాన్నిఎదబిందెలు పట్టలేకపోతుండడంతో పెదవులు అర్థపావు విచ్చుకొని ఉన్నాయి. ఎద ఎగిసిపడేకొలదీ ప్రతిగా నాభి నడుము లోపలికి పోతోంది. తరంగమైపోతానేమోనని ఇరుపాదాల వేలికొసలని నొక్కిపట్టి దేహానికి జారుముడి వేసాను. అయినా లాభం లేదాయే!.

పరుపు మెత్తదనం శత్రువయ్యిందని కటికనేల మీదకి చేరితే అది నీ బాహువుల కాఠిన్యాన్ని గుర్తుచేసింది. ఇది నిజంగా టార్చర్ తెలుసా. ఇలా కాల్చే కన్నా గుండెల్లో ఓ పిడిబాకుని దింపి ఒక్కసారిగా చంపెయ్యొచ్చుగా. ఇలా మధురూహలతో పోరాడి, అలసి ఎప్పటికో నిద్రపోయాను.

పొద్దున్నే లేచి అందంగా తయారయ్యాను. నీకోసం అలంకరించుకోవడమన్నది ఎంత మనోహరమైన వ్యాపకమో!. ఈ రోజు నువ్వు రావని తెలుసు. కానీ 'పొరపాటున వచ్చేస్తేనో!' అని ఆశపడే మనసుకి ఏమని సర్దిచెప్పను?. తయారయ్యాక ఏమి చెయ్యాలో తెలియక గుమ్మం దగ్గరకి వచ్చి ద్వారానికి చెంపని ఆనించి అలా చూస్తూ ఉండిపోయాను. అలా ఎంతసేపయ్యిందో అమ్మ తట్టి లేపేవరకూ తెలిసిరాలేదు. ఇది ఏ ధ్యానమో.. పరధ్యానమో!..

ఈ భోగమెంతటి వైభోగమైన నరకమో!.

Friday, 26 December, 2008

మిస్సింగ్ యు..

నేను నిద్రపోయాక రాత్రంతా మనసు నీ దగ్గరే తచ్చాడుతుందేమో. పొద్దున లేవగానే ఊహని స్పృశించే మొదటి రాగం నీ తలపే. నా సబ్కాన్షస్ పెట్టె నిండుగా నీ సుగంధంతో తొణుకుతుంటే అహం బిత్తరపోయి అంతలోనే సర్దుకుంటుంది. గంభీరమయిపోతాను. కొన్నిసార్లు నా గంభీరతని చూసి నేనే ఫక్కున నవ్వేసుకుంటాను.
బాత్రూమ్ లోకి బద్ధకంగా దూరాక, బకెట్ లోని నీటి మీద వేలితో అప్రయత్నంగా నీపేరు రాస్తాను. అది చెరిగిపోతుంది. కానీ అందులో నీ పేరుందని నాకు తెలుసు.
ఓసారి రోడ్డు మీద వెళుతున్నప్పుడు ఒక చిన్నమ్మాయి నన్ను వింతగా చూసినప్పుడు అర్థమయ్యింది- నువ్వు గుర్తొచ్చి నా ముఖం ముద్దుగా నవ్వుతోందని. వెనక్కి తిరిగి ఆ అమ్మాయిని పట్టుకొని ఫాస్ట్ గా ఓ ముద్దిచ్చేసి అక్కడి నుంచి పరిగెత్తా.
రాత్రి మేడ మీద తిరుగుతున్నప్పుడు నువ్వెప్పుడూ పాడే పాట గుర్తొస్తుంది. నీకస్సలు పాటలు పాడటం రాదు. ఆ పాటనైతే దారుణంగా ఖూనీ చేస్తావు. అప్పుడు వెక్కిరించాను గానీ ఇప్పుడు నీ పాట నాకెంతిష్టమో!!. నువ్వు పాడినట్లే పాడుతూ మళ్ళీ మళ్ళీ నవ్వుకుంటాను. నవ్వుకుంటున్నా సరే ఓ నీటితెర నా కళ్ళని అడ్డుగా కప్పేస్తుంది.

Friday, 5 December, 2008

రాత్రి ఒంటిగంటన్నర. నిద్ర రావట్లేదు. చలికాలం కావడం చేత ట్రైన్ లో అందరూ ముసుగులు తన్ని పడుకున్నారు. ఇంకొన్ని గంటల్లో తనని కలవబోతున్నాను. మనసులో ఏదో హుషారు ఈల. ట్రైన్ ఏదో స్టేషన్లో ఆగింది. స్టేషన్లో ఓ చిల్లర వ్యాపారి టీ కంటైనర్ ని పక్కన పెట్టుకొని బెంచి మీద కునుకు తీస్తున్నాడు. టీ తాగాలనిపించింది. ట్రైన్ దిగి వాడిని లేపి టీ అడిగాను. టీ ఇచ్చి ఎప్పటిలాగే నాలుగు రూపాయలు తీసుకున్నాడు. 'ఇంత రాత్రి వేళ నిద్ర చెడగొట్టుకొని సెర్వ్ చేస్తున్నాడు. extra చార్జ్ చెయ్యొచ్చు కదా.' అనుకున్నాను. నేను స్వతహాగా business man ని కావడంతో ఇలాగే ఆలోచిస్తాను. అతను ఎక్కువ చార్జ్ చేసుంటే అతనిమీద గర్వపడేవాడిని. ఒక సిగరెట్ కూడా తీసుకున్నాను. నాకు సిగరెట్ అలవాటు కాదు. అప్పుడప్పుడూ తీసుకుంటాను. materialistic things కి గానీ, మానవ బంధాలకి గానీ బానిసవడం, నన్ను నేను కోల్పోవడం నాకు నచ్చవు. ప్రశాంతమైన ఈ అర్థరాత్రి పూట చలిగాలిలో ఛాయ్ తాగుతూ దమ్ము లాగుతుంటే బాగుంది. I fucking loved this moment. స్టేషన్లో దూరంగా ఓ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. బయటవాళ్లెవరికీ నేను సిగరెట్ ని ఎంజాయ్ చేస్తున్నట్టుగా నా ముఖంలో ఎటువంటి భావాలూ కనపడవు. ఇది నా పర్సనల్ ఆనందం. నా ఆనందానికి ఎంత value ఇస్తానంటే పంచుకునేవారికి కూడా అదెంత valuable అని గ్రహించగలిగి ఉండాలి. ట్రైన్ కూత పెట్టడంతో ఎక్కాను.


నా గమ్యం వచ్చింది. ట్రైన్ దిగాను. చుట్టూ ఉన్న జనాలు పలచనయ్యాక తను కనపడింది. ఆమె కళ్ళలో నేను రానేమో, కనపడనేమో అన్న ఆలోచనల తాలూక ఒత్తిడి ఏమాత్రమూ లేదు. తను నా భార్య కాదు. నా భార్యకి బిజినెస్ పని మీద ముంబై వెళుతున్నానని చెప్పి ఈమెను కలవడానికి వచ్చాను. మేమెప్పుడూ పలకరించుకోం. కలిసి రెండు నెలలవుతున్నా గతక్షణమే మాట్లాడుకొని కంటిన్యూ చేస్తున్నట్లుగా మాట్లాడుకుంటాం. నేను దగ్గరకి వచ్చాను. కళ్ళు కళ్ళు కలుసుకున్నాయి. 'My desire is peaking.' అని కళ్ళలోకే చూస్తూ, ఏ expression లేకుండా ఒక statement లా చెప్పాను. తను నవ్వింది. చిన్న pause. మళ్ళీ నవ్వింది. ఈసారి నవ్వుతో పాటు తన కళ్ళలో కోరిక కూడా. నా కళ్ళు హర్షాన్ని తెలిపాయి. నా గెస్ట్ హౌస్ కి వెళ్లి మా కోరిక తీర్చుకున్నాం.

సుమారుగా ప్రతి రెండు నెలలకొకసారి మేం కలుసుకుంటాం. ఓ రెండుమూడు రోజులు కలిసుంటాం. తను ఓ సోషల్ వర్కర్. ఒక NGO ని నడిపిస్తోంది. నేను వ్యాపారిని. నాకు సోషల్ వర్క్ మీద ఆసక్తి లేదు. తనకి కూడా బిజినెస్ చెయ్యాలన్నఇంటరెస్ట్ లేదు. మా మధ్య ఆర్ధిక లావాదేవీలేమీ లేవు. మా ఇద్దరికున్న common point ఒక్కటే. మా వృత్తులపట్ల మాకున్న భావాలు. వ్రత్తి అని చెబితే వేరుచేసినట్లవుతుందేమో. నా గురించి నేను ఊహించుకున్నప్పుడల్లా నా బిజినెస్సే కనపడుతుంది. నారూపం కనపడదు. బయటవారందరికీ నేను ఏ ఫీలింగ్సూ లేని ఒక business man ని. నా భార్యకి కూడా నా మీద అదే భావముంది. కానీ అతికొద్దిమందికి మాత్రమే తెలుసు - నేనూ, నా వృత్తి వేరుకామని. తను కూడా అంతే. social work కి అవరోధమవుతుందని పెళ్లి, కుటుంబాన్ని వద్దనుకుంది. ' ఎప్పుడూ ఎమోషనల్ కాని ఈమెకేం తెలుసు social work. ', 'ఈవిడొక చండశాశనురాలు.' .. ఇలా తెలియనివారు ఈమె గురించి చెబుతుంటారు. మేము తొందరగా emote కాము ఎందుకంటే emotions మాకు చాలా విలువైనవి. ఇలాంటి చెప్పుకోని భావాలే తనని, నన్నుదగ్గర చేసాయి. మేం కలిసున్నరోజులు తిరగడం, తినడం తప్పిస్తే ఇంక చేసేవి రెండే పనులు- మాట్లాడుకోవడం, సెక్స్. మేము sweet nothings మాట్లాడుకోము. ఫ్యామిలీ విషయాలు అసలే ఉండవు. కేవలం మా పనుల గురించి, మా గురించే మాట్లాడుకుంటాము. ఇక సెక్స్ విషయానికొస్తే రెండు నెలలకొకసారి కలిసిన ఫస్ట్ టైం violent గా ఉంటుంది. మా frustrations reflect అవుతాయనుకుంటా. చివర్లో విడిపోయేముందటి కలయిక మాత్రం ఒక స్పూర్తివంతమైన అనుభవం. soft గా.. మాట్లాడుకుంటూ.. సున్నితంగా intimacy ని అద్దుకుంటూ.. నిన్నటి గాయాల, రేపటి భయాల ఉనికి లేకుండా.. really ఒక charging experience అది. మాది ప్రేమనా, వ్యామోహమా.. అని ఒక పేరు ఇవ్వడానికి, define చెయ్యడానికి నేను ప్రయత్నించను. ఎందుకిలా జరిగింది.. తను పరిచయం కాకపొతే ఏంటి?.. లాంటి ప్రశ్నలకి సమాధానాల కోసం వెతకను. irrational feelings కి నేను logic apply చెయ్యను. ఆలోచించేదల్లా నాకు కరెక్టా.. కాదా..అని. ఇప్పటి డెసిషన్ కి ఫ్యూచర్ లో బాధ పడతానా.. లేదా అని. నా కొడుక్కి 18 ఏళ్ళు వచ్చేవరకూ తండ్రి అవసరమని భావించాను. అందుకే తను, నేను దగ్గరయ్యామన్నవిషయం అనుభవంలోకి వచ్చాక (అప్పుడు నా కొడుక్కి 14 సంవత్సరాలు) నాలుగు సంవత్సరాల వరకూ మేము కలుసుకోలేదు. ఈ ప్రపంచానికి మా వ్యవహారం తెలిసినా మేమిద్దరం భయపడం, బాధపడం. నా భార్య నుండి విడిపోవడానికి నాకేమీ అభ్యంతరం లేదు. ఎన్నో ఏళ్లుగా మేమిద్దరం కేవలం బాధ్యతలని మాత్రమే షేర్ చేసుకుంటున్నాం. నా విషయం ఎప్పటికయినా తెలియాల్సిందే. నేను చెప్పకపోతే తను కొన్ని రోజులు ప్రశాంతంగా ఉంటుంది. విషయం తెలిస్తే తను బాధపడుతుంది. నా ద్వారా కాకుండా వేరే విధంగా బయటపడితే ఇంకొంచం ఎక్కువ బాధపడుతుంది. ఈ ఇంకొంచం ఎక్కువ బాధపడడాన్ని, చెప్పకపోవడం వలన తనకి దొరికే కొద్ది రోజుల ప్రశాంతతని కంపేర్ చేస్తే రెండవదే ఎక్కువ తూగింది. అందుకే నేనుగా ఈ విషయం తనకి చెప్పలేదు. ఇది తప్పని, ఒప్పని అనుకోకపోవడం వలన నాకెటువంటి గిల్టీ ఫీలింగ్ కూడా లేదు.


రెండు రోజుల తర్వాత ఇంటికి వచ్చాను. ఆ రోజు రాత్రి పక్క మీద నా భార్య ఇలా అంది- 'ముంబై ట్రిప్ నుండి వచ్చిన ప్రతిసారీ మీరు కొంచం తేడాగా కనపడతారు. ఎప్పుడూ రాయిలా ఉండే మీలో ఎక్కడో softness కనపడుతుంది.' తనింతలా expressive గా మాట్లాడటాన్ని, లోతుగా విశ్లేషించడాన్నినేను మొదటిసారి గమనించాను. తనని చూస్తూ అప్రయత్నంగా నా ముఖంలో ఒక మందహాసం మెరిసి మాయమయ్యింది.

Labels:

Friday, 24 October, 2008

ముసుగు లోపల..

ఉరుకుతూ బస్సెక్కాను. చీర చెమటతో తడిసిపోయింది. పొద్దంతా కూలి చేసి, సాయంత్రం ఆ డబ్బులతో మా చంటోడికి బట్టలు కొని, మా ఊరి బస్సెక్కేసరికి రాత్రి తొమ్మిది దాటింది. కండెక్టరు టికేట్ ఇచ్చాక చేతిలో రెండు రూపాయలే మిగిలాయి. ఊరెళ్ళాక పనికొస్తాయని దాచుకున్నాను. బాగా ఆకలేస్తుంది. పనితో ఒళ్ళు హూనమైనా నిద్ర పట్టట్లేదు. పొద్దుట్నుంచి తిండి లేదు. ఇంకేమీ చెయ్యలేక కళ్లు మూసుకున్నాను. ముందు సీట్లో ఒక బట్టతల ఆయన ప్రక్కవాళ్లకి దేవుని గురించి అందరికీ వినిపించేలా చెబుతున్నాడు. 'మనిషికి భగవంతుని మీద తప్ప మరే విషయం మీద అనురక్తి ఉండకూడదు.' అని ఇంకా ఏవేవో చెబుతున్నాడు. అందరూ ఆసక్తిగా వింటున్నా నాకేమీ ఎక్కట్లేదు. వాళ్ళెవరికీ ఆకలి లేదు. నాకుంది. కడుపు నిండాకే దేవుడు.

బస్ లో లైట్లాపేశారు. బయట కూడా చీకటిగానే ఉంది.మధ్యలో ఆగినప్పుడు ఒకాయన బస్సెక్కి నా పక్కన కూర్చున్నాడు. కొంచం కళ్ళెత్తితే ఆయన బూట్లు కనపడ్డాయి. మళ్ళీ చీకటి. కాసేపటికి ఆయన నా వైపుకి ఒరుగుతున్నాడు. నిద్రలో ఉన్నాడో ఏమో. నాకు అతన్ని పక్కకి తోసే ఓపిక ఎంత మాత్రం లేదు. ఆకలిని జయించడానికి నా శరీరాన్ని పట్టించుకోవడం మానేసాను. ఇంకాసేపటికి అతని చెయ్యి నా ఒంటి మీదకు చేరింది. నాకు పెద్దగా ఏమీ అనిపించలేదు. పైగా వచ్చే స్టాపులో అతని ద్వారా ఏమన్నా తినడానికి దొరుకుతుందన్న ఆశ కలిగింది. నా ఒంటి మీద అతని చెయ్యి కదులుతోంది. ఒళ్ళంతా చెమటతో, కండరాలు పీకుతూ నా శరీరం నాకే అసహ్యంగా ఉంది. కానీ నాకు అసహ్యమైన శరీరమే అతనికి అమృతప్రాయంలా ఉంది. అసలు నిజంగా వెలుగులో నేనతనికి నచ్చుతానా?.. అయినా ఆకలి గా ఉన్నప్పుడు ఏమి దొరికింది అని చూడము కదా. ఒక్కోసారి చీకటి (అజ్ఞానం)లో కూడా ఆనందముంటుంది. ఇంతలో బస్సాగింది. లైట్లు వెలిగాయి. అతని వయస్సు ముప్పై పైనే ఉంటాయి. చామనచాయితో ముఖమంతా మొటిమలున్నాయి. ఆకలేస్తుందని చెప్పాను. రెండు గారెలు, ఒక టీ ఇప్పించాడు. కడుపు తృప్తి పడింది. మళ్ళీ బస్సు కదిలింది. అలాగే అతని చెయ్యి నా ఒంటి మీద. కానీ నాకిప్పుడు అయిష్టం, కంపరం కలుగుతున్నాయి. ఇంతకుముందు 'కొంచం తిండి పెడితే చాలు వీడేమి చేసుకున్నా.' అని భావించిన నేను ఇప్పుడేంటి అస్సలు భరించలేకపోతున్నాను. అవసరం తీరిందనా?.. శారీరక అవసరాలు తీరాక మానసిక అవసరాలు వస్తాయేమో. అతని చేతిని పక్కకి తోసాను. మళ్ళీ చేయి వేయబోయాడు. 'ఏంటిది?' అని గట్టిగా అరిచాను. మానుకున్నాడు.


బస్సు కీచుమంటూ సడెన్ బ్రేకుతో ఆగేసరికి ముందు సీటుకి గుద్దుకునేంత పనయ్యింది. నిద్ర చిటికేసినట్టు ఎగిరిపోయింది. అందరూ ఏంటని అనుకుంటూ ఉండగానే వినపడింది ఓ గాండ్రింపు. చెవులు, గుండె రెండూ అదిరిపదేలా. ఆ గాండ్రింపుకి బస్సు అద్దాలు కూడా వణుకుతున్నాయి. అందరూ నోరెళ్ళబెట్టి అలాగే ఉండిపోయారు. ఎదురుగా హెడ్ లైట్ల వెలుగులో పెద్దపులి. ఆ ప్రాంతం అడవికి దగ్గరగా ఉండటం వలన పులి ఇలా అనుకోకుండా రోడ్డు మీదకి వచ్చిందేమో. అందరి ముఖాలు భయముతో బిగుసుకిపోయి తెల్లగా పాలిపోయాయి. కండక్టరు శబ్దం చెయ్యొద్దని అందరికీ సైగ చేసాడు. పులి గాండ్రింపు ఆపింది. కానీ అక్కడే నిలబడి బస్ వైపు చూస్తూ ఉంది. కండక్టరు నెమ్మదిగా అందరి దగ్గరకు వచ్చి, 'ఎవరూ కదలకండి. అందరూ కలిసి ఉంటే పులి ఏమీ చెయ్యదు.' అని లోగొంతుకలో చెప్పాడు. ఇంజన్ సౌండ్ తప్పించి మరే శబ్దమూ లేదు. ఇంతలొ పులి కదిలింది. మెల్లగా, ఠీవిగా అడుగులేస్తూ బస్ దాటింది. కానీ పులి మా కుడి వైపుకి రాసాగింది. అప్రయత్నంగా మేమంతా ఎడమవైపుకి జరిగాము. ఈ ప్రయత్నంలో కొంత శబ్దమయ్యింది. దేవుని గురించి మాట్లాడిన బట్టతలోడు గాభరాగా ఎడమవైపున్న డోర్ ని చేరుకున్నాడు. మళ్ళీ నిశ్శబ్దం. ఇంతలో పులి గాండ్రు మంటూ కుడివైపున్న కిటికీని పంజాతో కొట్టింది. అంతేమరుక్షణం బస్సులో ఎవరూ లేరు. అందరూ తలొక దిక్కు పరిగెత్తారు. అందులో ముందున్నది ఆ బట్టతల భక్తుడే. నేను నా మీద చెయ్యి వేసిన ఆ మొటిమలవాడిని అనుసరించాను. కొంతదూరం పరిగెత్తాక ఆయాసంతో రొప్పుతూ ఒక దగ్గర ఆగిపోయాము. వెన్నెలరాత్రి కావడంతో కొంచం కనపడుతోంది. మాకు కొంచం దూరంలో ఒక ముగ్గురు నలుగురి గుంపు కూడా ఆగి సేద తీర్చుకుంటున్నారు. ఇంతలో ఎవరో మా దారినే వస్తున్న శబ్దం వినపడింది. అతికష్టంగా నడుస్తున్నట్టు తెలుస్తూంది. దగ్గరికి వచ్చాక చూస్తే అతనికి ఒక కాలు కొద్దిగా కుంటి. తనని భుజం మీద వేసుకొని తీసుకెళ్ళమని మొటిమలవాడిని అడిగాడు. కాసేపటికి పదివేలకి బేరం కుదిరింది. డబ్బుకి బదులుగా వంటి మీదున్న బంగారం ఇస్తానన్నాడు. భుజం మీద కుంటివాడిని వేసుకొని మేము బయలుదేరబోతుండగా పులి ఎదురు గుంపు మీద దాడి చేసినట్టుంది. ఒక్కసారిగా పులి ఘర్జనలు, అరుపులు, పరుగులు. మేం కూడా పరుగులంకించుకున్నాం. ప్రాణం మీదున్న తీపికి కాళ్ళకి ముళ్ళు గుచ్చుకుంటున్నా నొప్పి తెలియట్లేదు. కాసేపటికి మొటిమలోడు సంభాలించుకోలేక పడిపోయాడు. దాంతో అతని భుజం మీదున్న కుంటివాడు ఎగిరిపడ్డాడు. దగ్గర్లోని చెట్టుకు తల తగలడంతో 'అమ్మా!.. ' అని గట్టిగా అరుస్తూ కుప్పకూలిపోయాడు. అతని తల చిట్లి రక్తం కారుతోంది. ఇంతలో మాకు చాలా దగ్గరలోనే పులి గాండ్రింపు వినపడింది. సగం ప్రాణాలు పైకెగిరిపోయినట్టు అనిపించింది. ఏదన్నా చెట్టెక్కమని మొటిమలోడు చెప్పాడు. దగ్గర్లోని చెట్లన్నీ పొడవుగా ఉన్నాయి. ఎక్కడమవ్వట్లేదు. ఇంతలో మొటిమలోడు కుంటివాడి బాడీ ని ఒక చెట్టు కింద పెట్టి వాడి మీద కాలు వేసి చెట్టెక్కాడు. నేను ఘోరమనుకుంటూ నిలబడ్డాను. ఇంతలో మళ్ళీ మా వెనుకగా పులి గాండ్రింపు. భయంతో వెన్ను జలదరించేసరికి నేను కూడా కుంటోడి బాడీ మీదెక్కి చెట్టేక్కేసాను. గుండె మీద కాలు వేస్తున్నప్పుడు అతని నోటి నుండి భళ్ళున రక్తం రావడం నా కంట పడింది. దగ్గర్లో కాసేపు పులి గాండ్రింపులు, జనాల హాహాకారాలు వినపడ్డాయి. కాసేపటికి మళ్ళీ నిశ్శబ్దం రాజ్యమేలింది. అలా చెట్టు మీదే ఒక మూడు గంటలు బిక్కు బిక్కు మంటూ కూర్చున్నాం. క్రిందన కుంటోడి తల నుంచి చిక్కటి నెత్తురు వెన్నెల వెలుగులో నల్లగా కనపడుతోంది. తరువాత చాలా సేపటి వరకూ పులి శబ్దాలు వినిపించకపోవడంతో చెట్టు దిగాము. ముందుగా దిగిన మొటిమలోడు కింద బాడీని చూసి చచ్చిపోయాడని చెప్పాడు. కుంటోడి శ్వాసని కూడా పరీక్షించలేదు. నాకు అనుమానమే.. కానీ అనుమానాన్ని పాతర వేసాను. ఒకవేళ బ్రతికి వుంటే గనుక ఆ కుంటివాడికి నేనే సహాయపడాలి. నా పక్కనున్నోడు పట్టించుకునేలా లేడు. ఇప్పుడా బాధ్యతని తీసుకునే పరిస్థితుల్లో నేను లేను. ఎందుకీ లేనిపోని తలనొప్పి. అదే చనిపోయాడని మనసుని సర్దిచెప్పుకుంటే .. ఇంకేం చెయ్యలేమని ముందుకి వెళ్ళవచ్చు. అందుకే కనీసం అతనివైపైనా చూడకుండా మొటిమలోడినిఅనుసరించాను. ఒక నాలుగు అడుగులు వేసాక నా ముందు నడుస్తున్న మొటిమలోడు ఆగి వెనక్కు వెళ్ళాడు. నేనూ వెనక్కి తిరిగి చూసాను. బహుశా ఆ కుంటివాడికి హెల్ప్ చేయ్యదానికేమో అనుకున్నా. కాని మొటిమలోడు కుంటివాడి మెడలో ఉన్న రెండు గోల్డ్ చైన్లు, వేళ్లకున్న మూడు ఉంగరాలు జేబులో వేసుకున్నాడు.

అందరం బస్సుని చేరుకున్నాం. ఒక్క కుంటివాడు తప్ప. కుంటివాడిని మేం చూడలేదని చెప్పాం. కాసేపు చూసి బస్సు కదిలింది. తెల్లారేసరికి మా ఊరి దగ్గరకి వచ్చేసాం. అటూ ఇటూ కాకుండా పట్టిన నిద్రకి మనసు కొంచం తేలిక పడింది. ఆ కుంటోడి సంఘటనని మనసులోంచి చేరిపెసాను. నాకు నేనే ఆ కుంటివాడు లేకుండా రాత్రి సంఘటనలని విజువలైజ్ చేసుకొని అవే నిజమని మనసుని హిప్నటైజ్ చేసేసాను. ఎంతలా అంటే నాకు నేనే నమ్మేంతలా. ఇంతలొ ఒకటి గుర్తొచ్చింది. పక్కన కూర్చున్న మొటిమలోడితో కుంటివాడి మెడలోని ఒక చైను నాకిమ్మని బ్లాక్మైల్ చేశాను. వాడు బెదిరి ఇచ్చేసాడు. మనసుకి ఇప్పుడొక కొత్త విజువల్ని ఆడ్ చేశాను - దారిలో నాకీ చైను దొరికినట్టు.


మా ఊరొచ్చింది. నాతోపాటు బట్టతల భక్తుడు, మరికొందరు దిగారు. బట్టతలోడు పక్కవాళ్ళకి ఇదంతా దైవనాటకమని చెబుతున్నాడు. నాకు మనిషి ముసుగేసుకొని ఆడుతున్న నాటకంలా అనిపించింది. ముసుగులోపల మనిషి ఒక ప్రాధమిక జంతువే. ఒక్క క్షణం పాటు నా మీద, మనుషుల మీద విపరీతమైన చీత్కారం కలిగింది. మరుక్షణం బిగ్గరగా నవ్వాను.


బేతాళుడు పట్టువదలని విక్రమార్కుడిని అడిగాడు - 'రాజా!.. కధ విన్నావు కదా. ఇంతకీ ఆవిడ ఎందుకలా నవ్వింది?'.

Labels: